RSS

Category Archives: RandomActOfWriting – Telugu

గురు కాబలి aka గురకా బలి

*** Found this write-up from 2005 or 2006 during the trunk clean up the other day.  ***

FullSizeRender

“గురూ, ఈ ఫారం నింపు. దీన్ని బట్టి నీకు పిల్లను చూస్తారు ఈ పెళ్లి బ్యూరో వాళ్ళు. నీ పెళ్లి నా చావు కొచ్చింది”, విసుక్కున్నాడు తాతాజీ.

పేరు: గురు కాబలి
వయస్సు: 36
అడ్రస్సు : హైదరాబాదు
తాగడం అలవాటు: లేదు
ఇతర అలవాట్లు: గురక పెట్టడం

ధీమాగా నింపాడు, గురు.

ఫారం చదివి, తాతాజీ కొట్టినంత పని చేసాడు. గురు “గురక” గురించి దాచిపెట్టి పెళ్లి చేయాలని తాతాజీ ఉద్దేశం. నిజం తెలిస్తే ఎవ్వరు పిల్లనివ్వరని ఖచ్చితంగా తెలుసు. గురు గురక భరించలేక గత పదేళ్లు చెవుల్లో దూది కుక్కుకొని, నోట్లో గుడ్డ కుక్కుకొని తనలో తాను ఏడ్చుకుంటూ భరించాడు. రోజులు మెరుగై ఈ మధ్యే తనకంటూ ఒక ప్రత్యేక గది కట్టించుకుని జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాడు, తాతాజీ.

గురక విషయం దాచిపెట్టడం ససేమిరా అన్నాడు గురు. వాడి మొండి చూసి ఏమి అనలేక తనలో తాను గొణుక్కుంటూ అక్కడినుంచి బయలుదేరారు ఇద్దరు.

********************************************************************

“రేయ్, వెధవాయ్, నిన్ను ఓ పిల్ల నచ్చిందంట. మనం పెళ్లి చూపులకి వెళ్ళాలి. అదృష్టం నీ వెంటే ఉంది. ఆ మాసిన గడ్డం గీకేసి, మంచి బట్టలేసుకుని బయలుదేరు”, గాబరా పెట్టేసాడు తాతాజీ.

ఆశ్చర్యం గురు వంతైంది. ఇంత తొందరగా పెళ్ళిచూపులా, అని నోరు తెరిచే లోపే, తాతాజీ అతన్ని బాత్రూమ్ లోకి తోసాడు.

ఆటోలో అందమైన ఇంటి ముందు దిగారు, తాతాజీ అండ్ కో. పిల్ల నచ్చింది, వాళ్ళు పెట్టిన తిను బండారాలు నచ్చాయి. గురు కి ఇదంతా కలలా ఉంది. పిల్లకి తాను బాగా నచ్చానని చెప్పిందంటా. అందరూ సంతోషంగా పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు

********************************************************************

తీరా పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి కూతురి బంగళా ఎదురింట్లో విడిది. ఆ రాత్రి బ్యాచిలరు పార్టీ అని గోల చేస్తే మందు పార్టీ ఏర్పాటు చేసాడు, ఆఫీసు వాళ్ళ కోసం. గురు కూడా వాళ్ళతో కలిసి పెగ్గేసాడు. అందరూ మందెక్కువై ఏదో ఏదో వాడుతున్నారు.

ఇంతలో గురు మనసులో, “అసలు పెళ్లి కూతురికి తన గురక  గురించి తెలుసా? బహుశా పెళ్లి బ్యూరో వాళ్ళు దాచి పెట్టారేమో?!?!” అని అనుమానం వచ్చింది.

లేడి కి లేచిందే తడవుగా, ఆ అర్థరాత్రి పెళ్లి కూతురితో తన నిజాయితీ, సత్యవ్రతాన్ని నిరూపించుకోడానికి బయలుదేరాడు. అందరి మధ్యలోంచి వెళ్లడం కుదరదు కనక వెనకద్వారం నుంచి వెళదామని నిశ్చయించుకున్నాడు.

గోడ దూకడం కష్టమేమి కాదు, పైపులెక్కి కిటీకీల్లోంచి కల్పన గది కోసం వెతకడం బహు కష్టం లా అనిపించింది గురు కి. అలా ఒక్కో గది చూస్తుండగా ఇంతలో భయంకర అరుపులు వినడం ఆరంభించాయి. గురు వెన్ను లోంచి చిన్న వణుకు. దెయ్యాలున్నాయేమో అని అన్ని వైపులా ఒక్కసారి తిరిగి చూసుకున్నాడు.

మద్యం మత్తు వల్ల ధైర్యం ఒక పాలు ఎక్కువగానే వచ్చింది. పట్టు వదలకుండా ఆ గది కిటికీ తెరిచాడు. అంతే, ఆ అరుపులు పెద్ద పెట్టున వచ్చాయి. “కల్పన, కాదు కాదు, మిసెస్ గురు కాబలి”, అని అంటూ రెండు చేతులు కాస్తా కిటికీ మీంచి తీసి గుండెపై పెట్టుకుని, “హమ్మా .. ” అన్నాడు.

ఏదో ఢబ్ మని కింద పడ్డ శబ్దం వినగానే, పెళ్లి వారింట లైట్లు వెలిగాయి ఒక్కసారిగా.

 

~ Savvy