RSS

Monthly Archives: February 2018

పిట్టగోడ కథలు – 2!

నా పేరు సీత నాతో పెట్టుకుంటే పెడతా వాత!

అంతలేసి గుడ్లేసుకుని
కాటుక కళ్లారా పెట్టుకుని
యెర్ర రిబ్బనుతో రెండు పిలకలు
నీలి రంగు ఫ్రాకు , తెల్ల చొక్కా
నుదిటి పై చిన్న శృంగార్ బ్రాండు బొట్టు

ఐదో తిరగతికే ఆడ రౌడీలా
మారిపోయిందే అని ఆశ్చర్యపోయా
బెంచిపై ఎవరో కూచున్నారని ఆ వార్ణింగు
తప్పు తనది కాదు వాడిదే అని తేల్చేసా
సీతకే నా ఓటు వేసేసా

విసురుగా వచ్చి నా పక్కన కూచుంది
అమ్మ మీదొట్టు గుండె ఆగినంత పనైంది
నా మాడు పగులద్దేమోనని భయపడ్డ
చిన్నగా నవ్వింది
మా స్నేహానికి గట్టి పునాది పడింది

ఇద్దరి ఇళ్ళు ఇరవై గజాల దూరం
కలిసి బడికి వెళ్లి రావడం
ఆదుకోవడం అన్నీ కలిసే

పెంటయ్య దుకాణం లో మురుకులు కొనడం
రంగయ్య తోటలో బాదం కాయలు కొట్టడం
ఎవరి పెదవులు ఎర్రగా ఉన్నాయో చూసుకుని మురిసిపోవడం

రేగి పళ్ళ బండి వాడు, చెరుకు రసం కన్నయ్య
సీత కి నాకన్నా కొంచెం ఎక్కువ పళ్ళిస్తే
తనకి తెలీకుండా నే ఉడుక్కోవడం

పండగలకి పేడ తెమ్మంటే పోటీ పది మరీ సేకరించడం
స్కూలు మాస్టారు రిపోర్ట్ కార్డు ఇస్తూ, ఇద్దరికీ సమంగా మార్కులొచ్చాయి
మీ స్నేహం ఇలాగే వర్ధిల్లాలి అని దీవించడం

స్నేహం మమ్మల్ని చూసి ముచ్చట పడిందా
లేక మేమే స్నేహానికి దాసులమయ్యామా

పిట్టగోడపై ఆనుకుని గత అనుభూతుల్ని ఆస్వాదిస్తున్నా
కళ్ళు చేమర్చేంత జ్ఞాపకాలుంటే జీవితమే ఒక జ్ఞాపకమవదా
నవ్వితే బుగ్గపై పడే గుంటలే ఆనందభాష్పాలవ్వవా !

Advertisements
 
Leave a comment

Posted by on February 12, 2018 in RandomActOfWriting - Telugu

 

పరికిణి

కిటికీ పక్కన వేపచెట్టు
ఆ పక్కనే పొందికగా కూచుని ఉందో చిలక
ఏదో రాజ్యపు పట్టపురాణిలా ఉంది
కాఫీ కప్పు వేడిగా ఉన్నంత సేపూ
ఆ చిలక వైపే నా దృష్టి
నేనేం తక్కువ తిన్నానా అంటూ దాని ప్రతి-దృష్టి

మనుషుల్ని చూసి చటుక్కున పారిపోవాల్సిన పక్షి
నను చూసి భయపడలేదు కనీసం దూరంగా ఎగరలేదు
మొదట తెలీని ఆశ్చర్యం తరువాత నవ్వడం అలవాటైంది

పొద్దున్నే కాఫీ మిళిత హంసరాగం అద్భుతం
సాయంత్రం ఎదురుచూపుల కూనిరాగం అర్ధవంతం
ఈ చిన్ని నేస్తం నా జీవితంలో ఒక భాగమైంది
ఇప్పుడు దానికో చిన్న చెక్క ఇల్లు
బస్తాడు ధాన్యం చాలినన్ని నీళ్లు
బెరుకు పోయి ఇంట్లో హాయిగా విహరిస్తుంది

గాల్లో తన రెక్కలను ఫ్యాను కన్నా వేగంగా ఊపితే
నా భుజాలపై మార్చి మార్చి కూర్చుని
నా తలచుట్టూ పలు సార్లు గిరగిరా తిరిగితే
అది యేన లేని సంతోషం అన్నమాట

చెలిమి ఎప్పుడు కుదిరిందో తెలియదు
తన భాష మౌనంగా ఎప్పుడు నేర్పిందో తెలియదు
అమాయకత్వాన్ని కసిగా పిసికేసే మనిషితో స్నేహం
కల్మషంలేని చిన్ని పొట్టలో నాపై ఎంత నమ్మకం!!

కిలకిలరావాల చిన్ని చిలక
నెలవంక తలపై తురుముకుని
ఇంద్రధనస్సు రంగులతో
చిటికెన వేలంత పరిమాణంతో
కళ్లకింపుగా కలుగుగోలుగా తిరుగుతోన్న
నే ముచ్చటగా పిలుచుకునే నా బంగారు చిలక, పేరు “పరికిణి”!

 

 

 
Leave a comment

Posted by on February 7, 2018 in RandomActOfWriting - Telugu

 

పిట్టగోడ కథలు!

సందు చివర చింత చెట్టు
ఆ వెనకాతల యేటి తట్టు
డాబా పైని పిట్టగోడపై కూర్చుని
భూమి ఆకాశం నిండిపోయేటన్ని
కథలు ఎన్ని చూశానో

చిరిగిన గౌను వెనుకుని, చింపిరి జుట్టుతో
కాలికి చెప్పులు లేకుండానే, మట్టినే మెత్తగా
ఐపొమ్మని శాసించి, పరుగెడుతున్న సీత
సాయింత్రాలు చల్లబడగానే చింత చెట్టు కింద
నాకోసం ఎదురుచూసిన గడియలు

సీత రాకుండా నే ముందెళితే
ఎటూ ఊసుపోదనీ ఊపిరాడదనీ
ఆలస్యంగా వెళ్ళాలన్న నా పంతం
సీమ చింతకాయలు, పుల్ల చింతకాయలతో
సీతతో దెబ్బలు తిన్న చందం

పిట్టగూడు కట్టి, పక్షులకి ఇల్లిచ్చి
అవి దిగేవరకూ రోజూ గుడ్లప్పగించి చూట్టం
గుడ్డులోంచి పక్షిపిల్లలు బయటికొస్తే
మా వల్లే అని బడాయి పోవడం

రిబ్బను రంగుల చక్రం చేతిలో పట్టుకుని
చెట్టు చుట్టూ పరిగెత్తి గాలిని ఓడించడం
ఎండకి డస్సి, నీడలో కూర్చుని
నీటిపై ఉన్న ఓడలని మట్టిలో గీయడం

బడికి వెడుతూ, వస్తూ చెట్టు పక్కన ఉన్న
చిన్న గేరు రంగు బండకి దండాలు పెట్టడం
అక్కడే ఉన్న పిలక పంతులు పెట్టే
అటుకులు బెల్లం పుట్నాలు తినడం

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కథలో ఎన్ని జ్ఞాపకాలో
ఆలోచనలకే సుంకం వేస్తె భూమిపై సగం భారం తగ్గిపోదా
జ్ఞాపకాలకే బహుమతులిస్తే సంతోషం సగం బలం అవ్వదా !

 
Leave a comment

Posted by on February 4, 2018 in RandomActOfWriting - Telugu