RSS

Monthly Archives: November 2017

నీరు!

నీరెండలో నడుస్తుంటే
నీడ నా వెంటే వున్నది
నన్నంటుకునే నడుస్తున్నది
నాలో తెలీని భద్రం
అంతలోనే తలపుల అభద్రతాభావం

నడినెత్తిన కడవనెత్తి
కళ్ళెర్ర జేస్తున్న యిసుకలో నడుస్తుంటే
నీడేమ్ ఖర్మ, నా దేహమే
నా వెంట ఉండనంటున్నది
ఉప్పు గట్టిన పొర (Sweat) కాస్తా గాలితో నేస్తామంటున్నది

ఎర్రటి ఎండకి
పాదాలు నిప్పు కణికలైతుంటే
ఇసుక దిన్నెలు ఆవురావురు మంటున్నై
నా చెమటలు వాటి దాహం తీరుస్తున్నై

ఆరేడు మైళ్ళ ఆశాజనక నడక
ఉట్టి నింపుకుని ఆస్తానా లేదా ఉట్టి చేతులతో ఒస్తానా
అన్న కలవరపు నీరస నడక

తడవ తడవకీ దొరికే సారా కాదు
కడవ కడవకి మాట్టాడుకునే గుర్తుంచుకునే మంచి బంధమూ లేదు

ఆబగా నడిచి యాభై అడుగుల గుంత తవ్వి
నల్ల కుండలో నీళ్లు నింపుతుంటే, కళ్ళల్లో నీళ్లు
కుండ నిండినందుకా ఇల్లు ఉద్దరించినందుకా
తెల్వక సతమతమైతి

అసలే నల్ల కాగు
అందులో ఇమిడిపోయిన నీళ్లు
లేవనెత్తితే గాని బరువు తెల్వదు
పిల్లగాళ్ళు నీళ్లు తాగితే గాని
నా మనసుల బరువు దిగదు

కన్నీటితో దాహం తీరితే జనం కష్టాలనే కోరుకోరా
తన మన బేధం లేకుండా అందరి మనసులు నొప్పియించరా

 

నీటి విలువ దాహానికి తెలుసు
దాహం అక్కర దారికి తెలుసు
ప్రతి నీటి చుక్క విలువ అమూల్యం
ప్రతి రోజూ తప్పదు ఈ దుర్భర సాహసం !

 

Advertisements
 
Leave a comment

Posted by on November 26, 2017 in RandomActOfWriting - Telugu

 

నా చెలి!

సంజె పొద్దు పూసింది
ముద్ద మందార రంగులో

నా చెలి చెక్కిలి మురిసింది
పండు నేరేడు ఎరుపుతో

నా చెలి వయ్యారంగా నడిచింది
లేత మొక్కళి పాదారవిందాలతో

తన వాలు కనుల చూపుతో
నా చెలి జగత్తును సమ్మోహించింది

శ్వేత వర్ణ పరికిణి
గరిచిప్పల కంఠసరి
చిలకపచ్చ మురుగులు
మేలు జాతి రత్న కుండలాలు
నవలోహ వడ్డాణము
శోభించెను ఆమె రూపు పై
సన్నని లే-సూర్యోదయ రేఖలా

అప్పుడే రాలి పడిన పారిజాత పూవుల
అరుదైన సింధూర చందన పరిమళం
ఆమె ఆవరణం

పగటి పూట చంద్రుడు నిండు మబ్బులతో
రాత్రి నీడ సూర్యుడు మినుకు తారలతో
రాజ్యమేలరా తన గల గల మాటలతో

వడి వడిగా నా చెలి నా వైపు పరిగెత్తుకొస్తుంటే
నా గుండె జారి ఆమె శ్వాస అవ్వదా
పోయే నా ప్రాణానికి ఆమె రూపు ప్రాణమివ్వదా!

 
Leave a comment

Posted by on November 15, 2017 in RandomActOfWriting - Telugu

 

గోస (ఘోష)

చింత చెట్టు నీడలో
నవ్వారు మంచెం పై ఉసూరుమని కూసోని
నా నీడని నేనే చూస్తుంటే

చెట్టు కొమ్మలు, వాటిపై అప్పుడే పుట్టిన లేరేకులు
పూకిరీటంలా నా తలచుట్టూ కోలాటమాడబట్టే

నా గుడిసెకి నేనే రాజు
నా పొలానికి నేనే మంత్రి
కానీ అజమాయిషీ చెలాయించే రాణి మాత్రం వాన తల్లి

వానమ్మా అనాలి గాని వానయ్య (వరుణుడు) అంటారేంది!
అమ్మకే గదా ఆకలి తెలిసేది
అమ్మకే గదా గుండె జారేది
గుక్కెడు గింజలు పండాలంటే అమ్మే కదా కరుణించాలి

గడ్డు ఎండాకాలంలో వచ్చే వాన
మట్టి లోంచి వచ్చే వాసన
అప్పుడే చిలికిన మజ్జిగలోంచి వచ్చిన వెన్న లాంటి సువాసన
ఇసక రేణువు, వాన జల్లుల ప్రేమ వర్ణన
అపుడే మొలకెత్తిన పిలక చెట్టు గోల డూ డూ బసవన్న

రుతువులు ఆరు
కాలాలు మూడు
మనిషి ఒకడు

కాలానికి అనుగుణంగా మనిషి మారితే అది మనుగడ
అనుభవాలకు అనుగుణంగా మనిషి మారితే అది వింత పోకడ

సమాజం విపరీతం
గుండె సున్నితం
మెదడు విషం కన్నా విపరీతం

అన్ని తట్టుకుని బతికి బట్టకట్టినోడు నిలబడి ఊరేగుతడు
లేనోడు, పాడే మీద పండుకుని ఊరేగుతడు !

 

 
Leave a comment

Posted by on November 7, 2017 in RandomActOfWriting - Telugu